నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పులు

నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పులు

ముంబై: ముంబైలోని బాంద్రాలో గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. నిందితులిద్దరూ హెల్మెట్ ధరించి ఉన్నారని, సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బాంద్రా పోలీసులు విచారణ ప్రారంభించారు. ఒక బుల్లెట్ ఖాన్ నివాసం గేటును కూడా తాకినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. దీంతో ఆయన నివాసం వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు. తెల్లవారుజామున 4.30 గంటల నుంచి 5 గంటల వరకు ఈ ఘటన జరిగినట్లు పోలీసు అధికారి తెలిపారు.

 "ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు రాంగ్ సైడ్ నుండి బైక్‌పై వచ్చి సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల వారి వాహనాన్ని ఆపారు. వారు తుపాకీని తీసి నాలుగు నుంచి ఐదు రౌండ్లు కాల్చి పారిపోయారు. బుల్లెట్‌లలో ఒకటి గెలాక్సీ అపార్ట్‌మెంట్ ప్రధాన గేట్‌ను కూడా తాకింది" అని ఒక అధికారి తెలిపారు. పోలీసులు, క్రైం బ్రాంచ్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. అనంతరం డాగ్ స్క్వాడ్ కూడా అక్కడికి చేరుకుంది.

నటుడు సల్మాన్ ఖాన్ గతంలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి అనేక బెదిరింపులను అందుకున్నాడు. ఖాన్‌ను చంపుతానని గ్యాంగ్‌స్టర్ బెదిరించాడు.